1 సమూయేలు 13:5-15

1 సమూయేలు 13:5-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని తమ సైన్యమంతా ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకొని గుహల్లో ముళ్ళపొదల్లో బండ సందుల్లో గుంటల్లో నీళ్లతొట్టెల్లో దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి గిలాదు దేశానికి వెళ్లిపోయారు. సౌలు ఇంకా గిల్గాలులో ఉన్నాడు; అతనితో ఉన్న దళాలు అన్ని భయంతో వణుకుతూ ఉన్నాయి. సమూయేలు చెప్పినట్లు అతడు ఏడు రోజులు ఎదురుచూశాడు; సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడంతో, అతని ప్రజలు చెదిరిపోవడం ప్రారంభించారు. కాబట్టి సౌలు, “దహనబలులు సమాధానబలులు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పి దహనబలి అర్పించాడు. అతడు దహనబలి అర్పించడం ముగించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలిసికొని అతనికి వందనం చేయడానికి బయలుదేరాడు. అయితే సమూయేలు అతన్ని, “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు, “నిర్ణయించిన సమయానికి నీవు రాకపోవడం, ప్రజలు నా దగ్గర నుండి చెదిరిపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమావేశమవ్వడం చూసి, ‘నేను ఇంకా యెహోవా దయను పొందక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద దాడిచేస్తారేమో’ అని అనుకున్నాను. కాబట్టి బలవంతంగా నేనే దహనబలి అర్పించాను” అన్నాడు. అందుకు సమూయేలు, “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా నీవు బుద్ధిలేని పని చేశావు; నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచాలని యెహోవా తలంచారు. అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలబడదు. ఎందుకంటే యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయలేదు. కాబట్టి యెహోవా ఒక మనుష్యుని కనుగొన్నాడు, అతడు తన హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన అతన్ని తన ప్రజల మీద రాజుగా నియమించారు” అన్నాడు. తర్వాత సమూయేలు గిల్గాలు విడిచిపెట్టి బెన్యామీనీయుల గిబియాకు వచ్చాడు; సౌలు తన దగ్గర ఉన్న మనుష్యులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరువందలమంది ఉన్నారు.

1 సమూయేలు 13:5-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు. ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతణ్ణి అనుసరించారు. సమూయేలు చెప్పినట్టు అతడు వారం రోజులు వేచి ఉండి, సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదరిపోవడం చూసి హోమ బలిని, శాంతి బలిని నా దగ్గరికి తీసుకు రమ్మని చెప్పి హోమబలి అర్పించాడు. అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతణ్ణి చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు. సమూయేలు అతణ్ణి చూసి “నువ్వు చేసిన పని ఏమిటి?” అని అన్నాడు. అందుకు సౌలు “ప్రజలు నానుండి చెదరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమకూడడం నేను గమనించి ఇక యెహోవాకు శాంతి బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను” అన్నాడు. అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలచాడు. అయితే నీ అధికారం నిలబడదు. యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.” సమూయేలు లేచి, ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినపుడు వారు సుమారు ఆరు వందలమంది ఉన్నారు.

1 సమూయేలు 13:5-15 పవిత్ర బైబిల్ (TERV)

ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది. ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు. సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు. “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు. సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు. అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు. అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞను పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు. ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు. అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు.

1 సమూయేలు 13:5-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నతస్థలములలోను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి – దహనబలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో–నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు–జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి –ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను–నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.