1 సమూయేలు 1:1-3

1 సమూయేలు 1:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. ఒకామె హన్నా, రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానా షిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికీ, బలులు అర్పించడానికీ ప్రతి సంవత్సరం తన ఊరినుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు యెహోవాకు యాజకులుగా ఉన్నారు.

1 సమూయేలు 1:1-3 పవిత్ర బైబిల్ (TERV)

ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు. ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ అతను బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొఫ్నీ, మరియు ఫీనెహాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు.

1 సమూయేలు 1:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరిగాని హన్నాకు పిల్లలులేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.