1 రాజులు 6:1-38
1 రాజులు 6:1-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు. మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు. అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు. ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు. క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు, రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు. మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు. క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు. అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి. యెహోవా వాక్కు సొలొమోనుతో, “నీవు కట్టించే ఈ మందిరం విషయంలో, నీవు నా శాసనాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికి లోబడితే, నేను నీ తండ్రియైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను. ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను, నా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టను” అని చెప్పారు. సొలొమోను మందిరం కట్టించడం ముగించాడు. మందిరం లోపలి గోడలను, అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలను, నేలను సరళవృక్షాల పలకలను పరిచారు. అతడు మందిరం వెనుక భాగంలో నేల నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో ఇరవై మూరల ఎత్తు గర్భాలయాన్ని అనగా అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న విశాల గది పొడవు నలభై మూరలు. మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుండ్రని పండ్లు, విచ్చుకున్న పువ్వులు చెక్కారు; అంతా దేవదారు కర్ర పనే ఉంది గాని రాయి ఒక్కటి కూడా కనిపించదు. అతడు మందిరం లోపల యెహోవా నిబంధన మందసం పెట్టడానికి గర్భాలయాన్ని సిద్ధపరిచాడు. గర్భాలయం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దాని లోపలంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా చేయించాడు. సొలొమోను మందిరం లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, గర్భాలయం ముందు భాగానికి బంగారు గొలుసుల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. మందిరం లోపలి భాగం పూర్తిగా బంగారంతో పొదిగించాడు. గర్భాలయానికి సంబంధించిన బలిపీఠాన్ని కూడా బంగారంతో పొదిగించాడు. గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి. మొదటి కెరూబుకు ఒక్కో రెక్క పొడవు అయిదు మూరలు, ఒక రెక్క కొన నుండి ఇంకొక రెక్క కొన వరకు పది మూరలు. రెండవ కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులు ఒకే కొలతతో ఒకే ఆకారంతో ఉన్నాయి. ఒక్కో కెరూబు ఎత్తు పది మూరలు. అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొని ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను, మరో కెరూబు రెక్క ఇంకొక గోడను తాకుతూ గది మధ్యలో వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. అతడు కెరూబులను బంగారంతో పొదిగించాడు. గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు. అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు. గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి. ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు. అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది. అంతేకాక అతడు రెండు తలుపులు సరళవృక్షాల కర్రతో చేయించాడు, ఆ రెండిటికి రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు. నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు. పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
1 రాజులు 6:1-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు. సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు. అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు. మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు. కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు. అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు. మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి. ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు. మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను. ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.” ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు. అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు. మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు. అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు. మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు. యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు. అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు. ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు. అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు. ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు. రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి. ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు. మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు. లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి. రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు. పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు. రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు. లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు. నాలుగో సంవత్సరం జీప్ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు. పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.
1 రాజులు 6:1-38 పవిత్ర బైబిల్ (TERV)
ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నుండి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన సొలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీవ్ అను రెండవ నెల. దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు ముప్పై అడుగులు దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు. దేవాలయపు ముఖమండపం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు పదిహేను అడుగులు. ఈ మండపం ప్రధాన దేవాలయానికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం యొక్క వెడల్పుకు సమానంగా వుంది. దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను వున్నాయి. పిమ్మట ప్రధాన దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను సొలొమోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా నిర్మింపబడ్డాయి. కింది అంతస్తులో ఉన్న గదుల వెడల్పు ఏడున్నర అడుగులు మధ్య అంతస్తులో గదుల వెడల్పు తొమ్మిది అడుగులు దాని పైగదుల వెడల్పు పదిన్నర అడుగులు గదులకు ఒక పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల గోడకన్న మందము తక్కవ. గదులన్నీ ఆ గోడకు ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టబడ్డాయి. ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్పులచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్లు వాడిన శబ్దం వినరాలేదు. దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవాలయపు పైకప్పును దూలాలతోను, దేవదారు చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ బడివుంది. సొలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుతాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ దేవాలయంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నటికి విడనాడను.” సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు మ్రాను చెక్కలతో కప్పబడింది. ముప్పై అడుగుల పొడవు గల ఒక గది దేవాలయానికి వెనుకగా కట్టబడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయం నుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర స్థలమని పేరు. ఈ మిక్కిలి పరిశుద్ధ స్థలం ముందున్నగది అరువది అడుగుల పొడవు గలిగివున్నది. ఆ దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సొర తీగలు మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ గోడ రాళ్లను చూడలేరు. ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది. ఈ అతి పరిశుద్ధ స్థలము ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తు కలిగివుంది. సొలొమోను ఈ అతి పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొదగబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి. దేవాలయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో పొదగబడింది. పనివారు కెరూబులను రెక్కలతో తయారు చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో వుంచారు. ప్రతి ఒక్క దేవదూత పదిహేను అడుగుల పొడవు వున్నది. రెండు కెరూబులు ఒకే పరిమాణంలో, ఒకే రకంగా నిర్మించబడ్డాయి. ప్రతి కెరూబుకీ రెండు రెక్కలున్నాయి. ప్రతి రెక్క ఏడున్నర అడుగుల పొడవుంది. ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు గల మధ్య దూరం పదిహేను అడుగులు. ప్రతి కెరూబు పదిహేను అడుగుల పొడవులో మలచబడింది. ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో పక్కపక్కన నిలబెట్టబడ్డాయి. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి. రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడల మీద, లోపల గదుల గొడల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పువ్వులు చిత్రీకరింపబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. తలుపు ఐదు రకాలుగా తిరిగే విధంగా ఐదు ముఖముల నిలువు కమ్మికి అమర్చబడింది. రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో పొదగబడ్డాయి. ప్రధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన చదరపు తలుపు అమర్చబడింది. దాని రెండు తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి. ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది. తరువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. పెరడు చుట్టూ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడలు చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది. ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని రెండవ నెలలో ప్రారంభించబడింది. ఆ నెల పేరు జీవ్. అది సొలొమోను ఇశ్రాయేలును పాలించటం మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం. సొలొమోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి ఆ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సొలొమోను ఏడు సంత్సరాలు కృషి చేశాడు.
1 రాజులు 6:1-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను. పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు, మందిరము ముందర అది పది మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మందిరపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగదియేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటితట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను. మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టిం చెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనినయెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను; నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పువరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను. మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు. యెహోవా నిబంధనమందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను. గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను. ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భా లయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను. మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను; ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవభాగము వెడల్పు ఉండెను. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబులమీదను తమాల వృక్షములమీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడ ల్పుగా నుండెను. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను. మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను. నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను; పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.