1 రాజులు 21:1-29 - Compare All Versions

1 రాజులు 21:1-29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కొంతకాలం తర్వాత, యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన ద్రాక్షతోటకు సంబంధించి ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలులో సమరయ రాజైన అహాబు భవనానికి సమీపంగా ఒక ద్రాక్షతోట ఉంది. అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు. అందుకు నాబోతు అహాబుతో, “నా పూర్వికుల వారసత్వాన్ని మీకు ఇవ్వకుండ యెహోవా తప్పించును గాక” అని అన్నాడు. యెజ్రెయేలీయుడైన నాబోతు, “నా పూర్వికుల వారసత్వాన్ని నేను మీకు ఇవ్వను” అని చెప్పడంతో అహాబు విచారంతో, కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. అతడు ముఖం మాడ్చుకుని ఏమీ తినకుండ తన పరుపు మీద పడుకున్నాడు. అతని భార్య యెజెబెలు అతని దగ్గరకు వచ్చి, “ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? ఎందుకు నీవు తినట్లేదు?” అని అడిగింది. అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు. అతని భార్య యెజెబెలు, “నీవు ఇశ్రాయేలుకు రాజువు కావా? లేచి తిను! సంతోషంగా ఉండు. ఆ యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను నేనే నీకు ఇప్పిస్తాను” అన్నది. కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది. ఆ ఉత్తర్వులలో ఆమె ఇలా వ్రాసింది: “ఉపవాస దినం ఒకటి ప్రకటించి నాబోతును ప్రజలమధ్య ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టండి. అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.” యెజెబెలు తమకు పంపిన ఆ ఉత్తర్వులలో వ్రాసిన దాని ప్రకారం నాబోతు పట్టణంలో ఉన్న పెద్దలు, సంస్థానాధిపతులు చేశారు. వారు ఉపవాసం ప్రకటించి నాబోతును ప్రజల ఎదుట ప్రముఖ స్థలంలో కూర్చోబెట్టారు. అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. “నాబోతు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు” అని యెజెబెలుకు వారు కబురు పంపారు. నాబోతును రాళ్లతో కొట్టి చంపిన సంగతి యెజెబెలు తెలుసుకొని అహాబుతో, “లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు వెండికి కూడా నీకు అమ్మనని చెప్పిన ద్రాక్షతోటను నీ వశం చేసుకో! నాబోతు ఇక ప్రాణంతో లేడు, చనిపోయాడు” అని చెప్పింది. నాబోతు చనిపోయాడని అహాబు వినగానే, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు లేచి వెళ్లాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది: “సమరయలో పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజైన అహాబును వెళ్లి కలుసుకో. ఇప్పుడతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు, దానిని వశం చేసుకోవడానికి అతడు వెళ్లాడు. అతనితో చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నీవు ఒక మనుష్యుని హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించలేదా? యెహోవా చెప్పే మాట ఇదే: ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.’ ” అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు. అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు. ఆయన, ‘నేను నీ మీదికి విపత్తును తీసుకురాబోతున్నాను. నీ సంతానాన్ని తుడిచివేస్తాను. ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా అహాబు వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు. “అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’ “అహాబుకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, దేశంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.” (తన భార్య యెజెబెలు ప్రేరేపణకు లొంగిపోయి యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తనను తానే అమ్ముకున్న అహాబులాంటి వారు ముందెన్నడూ ఎవ్వడూ లేరు. అహాబు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించేవాడు, ఇశ్రాయేలు ముందు నుండి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల్లా అతడు చేశాడు.) అహాబు ఆ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. గోనెపట్ట మీదే పడుకుంటూ దీనంగా తిరిగాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది: “అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.”

షేర్ చేయి
1 రాజులు 21 TSA

1 రాజులు 21:1-29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది. అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు. అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు. నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు. అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది. అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.” అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది. ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది. ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి. నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.” అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు. ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు. అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు. అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది. నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు, “నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు. నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.” అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు. యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను. యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి. పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు. తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు. ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు. అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు. యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు. “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”

షేర్ చేయి
1 రాజులు 21 IRVTEL

1 రాజులు 21:1-29 TERV (పవిత్ర బైబిల్)

రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది. ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలనుకుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.” నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు. అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు. అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది. అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.” అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది. తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది. ఆమె పంపిన లేఖలో ఇలా వుంది: “ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశపర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి. నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.” అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు. ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు. అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు. తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు. ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది. కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు. ఇదే సమయంలో యెహోవా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు: “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు. యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: ‘అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!’” తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు. ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు. ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.” అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది. కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు. ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు: “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”

షేర్ చేయి
1 రాజులు 21 TERV

1 రాజులు 21:1-29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోనురాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా అహాబు నాబోతును పిలిపించి–నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైనయెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు–నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా –నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చి–నీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను–నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీకిచ్చెదనని, యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు–నా ద్రాక్షతోట నీకియ్యననెను. అందు కతని భార్యయైన యెజెబెలు–ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనముచేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా–ఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి –నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండి– నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బలచేత మరణమాయెనని యెజెబెలు విని–నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను. అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను. నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము–యెహోవా సెలవిచ్చునదేమనగా–దీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా–ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతట అహాబు ఏలీయాను చూచి–నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను– యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరునులేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా – యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటివాడు ఎవ్వడును లేడు. ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.

షేర్ చేయి
1 రాజులు 21 TELUBSI