1 రాజులు 2:1-19

1 రాజులు 2:1-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దావీదు మరణించే సమయం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆదేశించాడు. అతడు అన్నాడు, “మనుష్యులందరు వెళ్లవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు. అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు. నీకు తోచిన ప్రకారం అతనికి చేయవచ్చు, అయితే నెరిసిన తలవెంట్రుకలతో సమాధానంతో సమాధికి వెళ్లనివ్వకు. “అయితే గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల దయ చూపించు, నీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వు. నేను మీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వీరు నా పక్షాన నిలబడ్డారు. “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను. అయితే ఇప్పుడు అతన్ని నిర్దోషిగా పరిగణించకు. నీవు జ్ఞానంగల వాడవు; అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. అతని నెరసిన తలను రక్తంతో సమాధికి తీసుకెళ్లు.” ఆ తర్వాత దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడి, దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు. దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది. హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది. అతడు, “అవును, సమాధానంగా వచ్చాను” అన్నాడు. తర్వాత అతడు, “నేను నీతో ఓ విషయం చెప్పాలి” అని అన్నాడు. ఆమె జవాబిస్తూ, “నీవు చెప్పవచ్చు” అన్నది. అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేస్తాను కాదు అనవద్దు” అన్నాడు. ఆమె, “నీ మనవి ఏంటో చెప్పు” అన్నది. కాబట్టి అతడు మాట్లాడుతూ, “రాజైన సొలొమోనును షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని అడుగు. అతడు నీ మాట కాదు అనడు” అన్నాడు. అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది. బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.

1 రాజులు 2:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు. అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు. అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు. అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు. నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు. ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను. అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.” ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు. దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది. అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది. అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి, తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు. ఆమె “ఏమిటో చెప్పు” అంది. అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది. ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు. ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు. బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది. బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.

1 రాజులు 2:1-19 పవిత్ర బైబిల్ (TERV)

దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు: “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పినవన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’” “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి. కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.” “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు. “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసి షిమీని నేను చంపనని చెప్పాను. కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.” ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు. ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు. ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు. “నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది. “అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం. నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు. “అయితే మాట్లాడు” అన్నది బత్షెబ. అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు. కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.” “నీకేం కావాలి?” అని బత్షెబ అడిగింది. “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు. “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడతాను” అని బత్షెబ అన్నది. కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి ప్రక్కగా కూర్చున్నది.

1 రాజులు 2:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను –లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవు చున్నాను; కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి, ఆయన మార్గముల ననుసరించినయెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము; అప్పుడు–నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నాయెదుట తమ పూర్ణహృదయముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనినయెడల ఇశ్రాయేలీయుల రాజ్యసింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్నుగూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షలమీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయ వచ్చునుగాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందరనుండి పారిపోగా, గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారిమీద దయయుంచి నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగా–యెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు; నీవు సుబుద్ధిగలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియును; వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతోకూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనముమీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె –సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి –నీతో చెప్పవలసిన మాటయొకటి యున్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై యుండెననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు; అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను; అది యెహోవావలన అతనికి ప్రాప్తమాయెను, ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసికొనుచున్నాను, కాదనకుము. ఆమె–చెప్పుమనగా అతడు–రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదనిచెప్ప డనెను. బత్షెబ–మంచిది, నిన్నుగూర్చి రాజుతో చెప్పెదననెను. బత్షెబ రాజైన సొలొమోనునొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను.