1 రాజులు 18:36-39
1 రాజులు 18:36-39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అర్పణ సమయంలో, ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరగా వెళ్లి ఇలా ప్రార్థించాడు: “యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలులో మీరే దేవుడని, నేను మీ సేవకుడినని, మీ ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశానని ఈ రోజు వెల్లడి చేయండి. యెహోవా, నాకు జవాబివ్వండి; మీరే దేవుడైన యెహోవా అని, మీరు వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వండి.” అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, మట్టిని దహించి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేలా చేసింది. ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి, “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అని అంటూ కేకలు వేశారు.
1 రాజులు 18:36-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు.
1 రాజులు 18:36-39 పవిత్ర బైబిల్ (TERV)
సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.” అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”
1 రాజులు 18:36-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను – యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరును దాని చూచి సాగిలపడి–యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.