1 రాజులు 17:7-24
1 రాజులు 17:7-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది. అప్పుడు యెహోవా వాక్కు అతనికి వచ్చింది: “నీవు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి, అక్కడ ఉండు. అక్కడ ఆహారం పెట్టాలని ఒక విధవరాలికి ఆదేశించాను.” కాబట్టి అతడు లేచి సారెపతుకు వెళ్లాడు. పట్టణ ద్వారం దగ్గరకు చేరగానే, అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అతడు ఆమెను పిలిచి, “త్రాగడానికి నాకు గిన్నెలో నీళ్లు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే, అతడు పిలిచి, “దయచేసి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా” అన్నాడు. అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది. ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు. ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది. ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు. కొంతకాలం తర్వాత ఇంటి యజమానురాలి కుమారునికి జబ్బుచేసింది. ఆ జబ్బు తీవ్రమైనందుకు అతడు ప్రాణం విడిచాడు. ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?” ఏలీయా జవాబిస్తూ, “నీ కుమారున్ని నాకు ఇవ్వు” అన్నాడు. ఆమె చేతిలో నుండి అతన్ని తీసుకుని, తాను ఉంటున్న మేడ గదికి తీసుకెళ్లి, తన పడక మీద పడుకోబెట్టాడు. తర్వాత అతడు యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, “యెహోవా నా దేవా, నేను ఎవరి ఇంట్లో అతిథిగా ఉంటున్నానో ఆ విధవరాలి కుమారున్ని చనిపోయేలా చేసి, ఆమెకు కూడా విషాదాన్ని కలిగించారా?” తర్వాత అతడు ఆ బాలుని మీద మూడుసార్లు చాచుకొని, “యెహోవా, నా దేవా! ఈ బాలునికి ప్రాణం తిరిగి రానివ్వండి!” అని యెహోవాకు మొరపెట్టాడు. ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నారు, బాలునికి ప్రాణం తిరిగి వచ్చింది, అతడు బ్రతికాడు. ఏలీయా ఆ బాలున్ని ఎత్తుకుని ఆ గది నుండి క్రింద ఇంట్లోకి తీసుకువచ్చి, ఆ బాలుని తల్లి చేతికి ఇస్తూ, “చూడు, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడు” అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో, “ఇప్పుడు మీరు దైవజనులని, మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమని నాకు తెలిసింది” అన్నది.
1 రాజులు 17:7-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు. నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.” కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు. కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు. ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది. అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు. ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.
1 రాజులు 17:7-24 పవిత్ర బైబిల్ (TERV)
వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.” కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు. “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది. ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’” అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు. కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రమయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది. “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?” పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు. యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు. ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు. “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.
1 రాజులు 17:7-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి–త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి–నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను. అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను–భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పునచేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను. ఆమె ఏలీయాతో –దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవిచేయగా అతడు–నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి –యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని–యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి–ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతో–నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను.