1 కొరింథీయులకు 7:36-40
1 కొరింథీయులకు 7:36-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి. అయితే ఎవడైనా కన్యను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకొని, దానికి తగిన మనోబలం కలిగి ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది కూడా మంచిదే. కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త చనిపోతే ఆమె తనకిష్టమైన వాన్ని పెళ్ళి చేసుకోవడానికి స్వతంత్రురాలే కాని, అతడు దేవునికి చెందినవాడై ఉండాలి. అయితే, ఆమె ఉన్న రీతిగానే ఉంటే, అది ఆమెకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. నేనయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నాను.
1 కొరింథీయులకు 7:36-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు. అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని. కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు. భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి. అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.
1 కొరింథీయులకు 7:36-40 పవిత్ర బైబిల్ (TERV)
తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా పెళ్ళి మాని సరియైన పని చేస్తున్నాడు. కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు. భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి. ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.
1 కొరింథీయులకు 7:36-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.