1 కొరింథీయులకు 6:12-20
1 కొరింథీయులకు 6:12-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు” కాని, నేను దేనికి లొంగిపోను. “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే. దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపారు. కాబట్టి ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతారు. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు. వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏకశరీరం అవుతారు” అని వ్రాయబడి ఉంది కదా! అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు. లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.
1 కొరింథీయులకు 6:12-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను. ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.
1 కొరింథీయులకు 6:12-20 పవిత్ర బైబిల్ (TERV)
“ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు. లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
1 కొరింథీయులకు 6:12-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? –వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా? అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.