1 కొరింథీయులకు 6:1-7
1 కొరింథీయులకు 6:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు దానిని పరిశుద్ధుల ముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కోసం దాన్ని తీసుకెళ్తారా? పరిశుద్ధులే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే చిన్న చిన్న తగాదాలను మీరు పరిష్కరించుకోలేరా? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు కదా! కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా? మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా? అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్థానానికి తీసుకెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు! నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?
1 కొరింథీయులకు 6:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా? కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట! అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా?
1 కొరింథీయులకు 6:1-7 పవిత్ర బైబిల్ (TERV)
ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట. మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది.
1 కొరింథీయులకు 6:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరు గరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరులమధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు. ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?