1 కొరింథీయులకు 5:9-13

1 కొరింథీయులకు 5:9-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా! ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను. సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా? సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”

1 కొరింథీయులకు 5:9-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు. సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.

1 కొరింథీయులకు 5:9-13 పవిత్ర బైబిల్ (TERV)

నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు. సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.” కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.

1 కొరింథీయులకు 5:9-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలివారికి తీర్పు తీర్చుట నా కేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి.