1 కొరింథీయులకు 3:5-9
1 కొరింథీయులకు 3:5-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు. నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే. కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు. నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
1 కొరింథీయులకు 3:5-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు. నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే. కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు. నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు. మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
1 కొరింథీయులకు 3:5-9 పవిత్ర బైబిల్ (TERV)
ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళు పోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే. విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు. విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్దేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీ ఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే, మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం. మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు.
1 కొరింథీయులకు 3:5-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.