1 కొరింథీయులకు 2:10-13

1 కొరింథీయులకు 2:10-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము. మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము.

1 కొరింథీయులకు 2:10-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.

1 కొరింథీయులకు 2:10-13 పవిత్ర బైబిల్ (TERV)

కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు. ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు. మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదే విధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చినవాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం. మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము.

1 కొరింథీయులకు 2:10-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.