1 కొరింథీయులకు 13:1-4
1 కొరింథీయులకు 13:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను. నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే. నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు. ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.
1 కొరింథీయులకు 13:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
1 కొరింథీయులకు 13:1-4 పవిత్ర బైబిల్ (TERV)
ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి. నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము. ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు.
1 కొరింథీయులకు 13:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు