1 కొరింథీయులకు 1:18-31
1 కొరింథీయులకు 1:18-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి. దీని గురించి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, “జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను; వివేకవంతుల తెలివిని వ్యర్థం చేస్తాను.” జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా? దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు. సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది. యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు. అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు. ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. లోకపు దృష్టిలో మీలో చాలామంది జ్ఞానులు కారు, ఘనులు కారు, గొప్ప వంశంలో పుట్టిన వారు కారు. అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు. ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు. కాబట్టి, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి” అని వ్రాయబడి ఉంది.
1 కొరింథీయులకు 1:18-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది. జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు. యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది. సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం. అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
1 కొరింథీయులకు 1:18-31 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.” మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు. యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది. సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”
1 కొరింథీయులకు 1:18-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయెను. యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. –అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.