1 కొరింథీయులకు 1:13-17

1 కొరింథీయులకు 1:13-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా? నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును! స్తెఫెను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.

1 కొరింథీయులకు 1:13-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

1 కొరింథీయులకు 1:13-17 పవిత్ర బైబిల్ (TERV)

అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపై చనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా? నేను క్రిస్పుకు, గాయికి తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు. ఔను, నేను స్తెఫను కుటుంబానికి చెందినవాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు. ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.

1 కొరింథీయులకు 1:13-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.