1 కొరింథీయులకు 1:1-9

1 కొరింథీయులకు 1:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు, క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కాబట్టి, మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు. కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు. తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

1 కొరింథీయులకు 1:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు, కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక. క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

1 కొరింథీయులకు 1:1-9 పవిత్ర బైబిల్ (TERV)

దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొస్తెనేసు నుండి. కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగు గాక! మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించు గాక! యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.

1 కొరింథీయులకు 1:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుని చిత్తమువలన యేసుక్రీస్తుయొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి; గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.