1 దినవృత్తాంతములు 21:7-15 - Compare All Versions
1 దినవృత్తాంతములు 21:7-15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ కార్యము దేవునిదృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు–నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము. – యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను –మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడుదినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవాదూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగ జేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము. అందుకు దావీదు–నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో–చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లము నొద్ద నిలిచెను.
1 దినవృత్తాంతములు 21:7-15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు. దావీదు “నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను. నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి” అని దేవునికి మొర్రపెట్టాడు. దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా “నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమంటే, మూడు విషయాలు నేను నీముందు ఉంచుతున్నాను. వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకో. దాన్ని నీకు చేస్తాను” అన్నాడు. కాబట్టి, గాదు దావీదు దగ్గరికి వచ్చి, “మూడు సంవత్సరాలు కరువు కలగడం, లేదా మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక ఓటమి పాలవ్వడం, లేదా, మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం, అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం. ఈ మూడింట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి, నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు” అన్నాడు. అందుకు దావీదు “నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను” అని గాదుతో అన్నాడు. కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు. యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
1 దినవృత్తాంతములు 21:7-15 TERV (పవిత్ర బైబిల్)
దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు. పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.” గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు అవకాశాలు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’” ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు’. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.” అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయుము.” అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు. యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
1 దినవృత్తాంతములు 21:7-15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ ఆజ్ఞ దేవుని దృష్టిలో కూడా చెడ్డగా ఉంది; కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించారు. అప్పుడు దావీదు దేవునితో, “నేను ఇది చేసి ఘోరపాపం చేశాను. మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు. యెహోవా, దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నారు, “వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ” కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో: మూడు సంవత్సరాల కరువు, మూడు నెలలు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నుండి పారిపోవడం, లేదా మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అనగా తెగులు వ్యాపించడం ద్వారా యెహోవా దేవదూత ఇశ్రాయేలీయుల దేశమంతటిని నాశనం చేయడం.’ ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో నిర్ణయించుకో” అన్నాడు. అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు, డెబ్బైవేలమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.