ఆమోసు 2:6-16
ఆమోసు 2:6-16 TSA
యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు. వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు. తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు. “దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను. అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను. “అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు. “కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను. వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. విలుకాడు నిలబడలేడు, బాగా పరుగెత్తగల సైనికుడు తప్పించుకోలేడు, గుర్రపురౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా దిగంబరులై పారిపోతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

