1 రాజులు 12:16-24

1 రాజులు 12:16-24 TERV

ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు. అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు. కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు. అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు. యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు. రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక. కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు. మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.