అపొస్తలుల కార్యములు 4:13-31

అపొస్తలుల కార్యములు 4:13-31 IRVTEL

వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు. అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే. పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు. యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు. ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు. ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

అపొస్తలుల కార్యములు 4:13-31 కోసం వీడియో