1 రాజులు 12:16-24

1 రాజులు 12:16-24 IRVTEL

కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు. అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు. తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు. ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు. యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు. రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు. కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు. “నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.