అపొస్తలుల కార్యములు 22:17-28

అపొస్తలుల కార్యములు 22:17-28 TELUBSI

అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడాయన–నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను–ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును. మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని. అందుకు ఆయన–వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలువేయుచు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకా శముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి– నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీ యుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి–నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి– నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.

అపొస్తలుల కార్యములు 22:17-28 కోసం వీడియో