దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షముక్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను – బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలములను ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండి–యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు–అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు–చిత్తము నా యేలినవాడా అనెను. సౌలు–నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా అహీమెలెకు–రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా రాజు–అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీదపడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా రాజు దోయేగుతో–నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీదపడి ఏఫోదు ధరించుకొనినయెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.
చదువండి 1 సమూయేలు 22
వినండి 1 సమూయేలు 22
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 22:6-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు