రోమా పత్రిక 6

6
(3) అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – క్రీస్తు మరణ పునరుత్థానాలతో ఐక్యత మూలంగా
1కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? 2అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? 3క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?
4తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.
8మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. 10ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.
అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – పాత జీవితం చనిపోయినట్టుగా ఎంచి కొత్త జీవితాన్ని దేవునికి లోబరచడం మూలంగా
11ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
12కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. 13మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
(1) ఆత్మ మూలంగా మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం ద్వారా
రోమా 8:2
14మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. 15అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. 16మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
19మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. 20మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. 21అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. 22అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. 23ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

Marker

Kopier

Sammenlign

Del

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på

Video om రోమా పత్రిక 6