YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 2

2
1లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. 2ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. 3తరువాత ఆమె వాని దాచలేక వానికొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానినిపెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, 4వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. 5ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచు లోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి 6తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి– వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. 7అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. 8అందుకు ఫరో కుమార్తె–వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. 9ఫరో కుమార్తె ఆమెతో–ఈ బిడ్డను తీసికొనిపోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొనిపోయి పాలిచ్చి పెంచెను. 10ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
11ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. 12అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను. 13మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. 14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి–నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు–మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే–నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను. 15ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను. 16మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా 17మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. 18వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు–నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. 19అందుకు వారు–ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా 20అతడు తన కుమార్తెలతో–అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. 21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను. 22ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే–నేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము#2:22 పరదేశి. అనుపేరు పెట్టెను.
23ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. 24కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. 25దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy