అపొస్తలుల కార్యములు 13
TELOV-BSI
13
1అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.౹ 2వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.౹ 3అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
4కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.౹ 5వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.౹ 6వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.౹ 7ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.౹ 8అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.౹ 9అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై౹ 10అతని తేరిచూచి–సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది#13:10 అనగాసాతాను. కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?౹ 11ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.౹ 12అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వ సించెను.
13తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.౹ 14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.౹ 15ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు–సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.౹ 16అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను–
17ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి౹ 18యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.౹ 19మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.౹ 20ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.౹ 21ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్లవరకు దయచేసెను.౹ 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
23అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.౹ 24ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.౹ 25యోహాను తన పనిని నెరవేర్చుచుండగా –నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.
26సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.౹ 27యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.౹ 28ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.౹ 29వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.౹ 30అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.౹ 31ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.౹ 32-33దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆలాగే
–నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.౹ 34మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి–దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.౹ 35కాబట్టి వేరొక కీర్తనయందు–నీ పరిశుద్ధుని కుళ్లుపట్ట నియ్యవని చెప్పుచున్నాడు.౹ 36-37దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.౹ 38కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,౹ 39మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.౹ 40ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా–
41ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి
నశించుడి
మీ దినములలో నేనొక కార్యము చేసెదను
ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత
మాత్రమును నమ్మరు అనెను.
42వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.౹ 43సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
44మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.౹ 45యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.౹ 46అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి–దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;౹ 47ఏలయనగా
–నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు
నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.౹ 48అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.౹ 49-50ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.౹ 51వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.౹ 52అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

Telugu O.V. Bible, - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

Learn More About పరిశుద్ధ గ్రంథము OV Bible (BSI)