YouVersion Logo
Search Icon

1 కొరింథీయులకు 15

15
1మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. 2మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నయెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. 3నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, 4లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. 5ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. 6అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 7తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. 8అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; 9ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. 10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే. 11నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
12క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరు–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? 13మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు. 14మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 15దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. 16మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు. 17క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. 18అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. 19ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
20ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. 21మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 22ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. 23ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు#15:23 లేక, ఆగమనమునందు. ఆయనవారు బ్రది కింపబడుదురు. 24అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. 25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 26కడపట నశింపజేయబడు శత్రువు మరణము. 27దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోబరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. 28మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును.
29ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? 30మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల? 31సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. 32మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరా డినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల –రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. 33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరు పును. 34నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయ కుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.
35అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. 36ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 37నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. 38అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 39మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. 40మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 41నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా 42మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 43ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; 44ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది. 45ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను. 46ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. 47మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. 48మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే. 49మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము.
50సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 51-52ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. 54ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, –
విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? 56మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 57అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy